సెప్టెంబర్ 15వ తేదీ నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయండి…జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య.

కిరణ్ 24×7న్యూస్; సెప్టెంబర్ 15వ తేదీ న నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో గణేష్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15వ తేదీ నిర్వహించనున్న వినాయక నిమజ్జనం ఉత్సవ నిర్వహణ కు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి ముందు రోజు నుండి మద్యం అమ్మకాలు జరగకుండా డ్రై డే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. కెసి కెనాల్ లో నీటి ప్రవాహం అవసరానికి మించి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రమాదాలు జరగకుండా నీటి ప్రవాహం నిమజ్జనానికి తగినట్లుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి 8 క్రేన్ లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి క్రేన్ కి ఇద్దరు డ్రైవర్లు, మెకానిక్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..క్రేన్ లకు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసి సర్టిఫై చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు..నిమజ్జన మార్గంలో కిందకు వేలాడిఉన్న కరెంట్ తీగలు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఘాట్ ల వద్ద జనరేటర్లను కూడా ఏర్పాటు చేయాలని, అనాథరైజ్డ్ కనెక్షన్లు లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు..

6 ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్ లు, బోట్లు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా మత్స్య శాఖ అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్ లను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. నిమజ్జనం అయిపోయే వరకు గజ ఈతగాళ్లు ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. లైఫ్ జాకెట్, ఫైర్ వెహికల్స్, లైఫ్ బాయ్స్, రెస్క్యూ టీమ్ లను కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ల వద్ద అంబులెన్స్, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఏంహెచ్ఓ ని అదేశించారు. అలాగే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో శానిటేషన్ కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నగరంలో పని చేయనటువంటి సిసి కెమెరాలు రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నన్నూరు సబ్ స్టేషన్ కి సంబంధించిన క్రేన్ ను మెయిన్ ఘాట్ లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. కర్నూలు రూరల్ తహసిల్దార్, కల్లూరు తహసిల్దార్ లు కూడా ఒక ఒక క్రేన్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు..

ప్రతి ఘాట్ కి లైజన్ అధికారులను నియమించుకుని నిమజ్జనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

కర్నూలు డి.ఎస్.పి బాబూ ప్రసాద్ మాట్లాడుతూ రాంభొట్ల దేవాలయం నుండి వచ్చే దారిలో వేలాడి ఉన్న కేబుల్ వైర్ లు సరి చేయాలని అధికారులను కోరారు..ప్రతి విగ్రహానికి అనుమతి తీసుకోవాలని, వాటికి సీరియల్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని, తద్వారా విగ్రహాలు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు వీలుగా ఉంటుందన్నారు. విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం పూర్తయిన వాహనాలు మరల తిరిగి అదే దారిలో వెళ్లకుండా కిసాన్ ఘాట్ రోడ్డు మీదుగా ఆనంద్ థియేటర్ రోడ్డు మీదికి ట్రాక్టర్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ కి అవకాశం ఉంటుందన్నారు. హైవే నుండి రింగ్ రోడ్డు రావడంతో వాహనాలు టౌన్ లోకి రాకుండా ట్రాఫిక్ తగ్గిందని, అదే విధంగా నన్నూర్ నుండి గార్గేయపురం వరకు సిద్ధంగా ఉన్న రింగ్ రోడ్డు ను కూడా నిమజ్జనం ఒక్కరోజు ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించాలని, తద్వారా శ్రీశైలం, ఆత్మకూరు నుండి రానున్న వాహనాలను టౌన్ లో నుండి రానివ్వకుండా గార్గేయపురం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చేసిన యెడల ట్రాఫిక్ క్లియరెన్స్ అవుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు .

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వపరంగా తీసుకోవలసిన పలు అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావు, కర్నూల్ ఆర్డిఓ శేషి రెడ్డి, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, ఆదోని ఆర్డీవో విశ్వనాధ్, గణేష్ ఉత్సవం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, కర్నూలు నగర అధ్యక్షులు డా.మోక్షేశ్వర్, జిల్లా సహకార్యదర్శి రంగస్వామి, సుధాకర్, సిటీ జనరల్ సెక్రెటరీ జనార్ధన్, కోడుమూరు గణేష్ కార్యదర్శి నటరాజ్, నగర సహ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.