ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన..
Kiran24x7news :
రాధాకృష్ణ రోత రాతలపై కోడుమూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిమ్మ ధ్వజం
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కర్నూలు పట్టణంలోని రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఏబీఎన్ ఛానల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళనలో కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిమ్మ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్, శ్రీదేవి మ్మ మాట్లాడుతూ… “ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ పేరుతో మహిళలను, ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీ నాయకుల కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడటం అత్యంత దుర్మార్గం. ఇది జర్నలిజం కాదు, అసలు విలువలు లేని ప్రవర్తన. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

“ప్రజాస్వామ్యంలో మీడియాకు గొప్ప బాధ్యత ఉంది. కానీ కొంతమంది మీడియా సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇది ఆపాల్సిన అవసరం ఉంది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన రాధాకృష్ణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
“ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం అయితే వైయస్ఆర్‌సీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతాం. మహిళల గౌరవం కోసం చివరి వరకు పోరాడతాం” అని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో జడ్పిటిసి ప్రసన్న కుమార్, మాజీ మండల ఉపాధ్యక్షులు డి వాసు, సంపత్, కోటేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి గౌతం, జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్, జిల్లా సోషల్ మధు శేఖర్, కోడుమూరు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు గిరి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, మాజీ సర్పంచ్ విద్యాసాగర్, సలీం భాష,మద్దిలేటి, సాదిక్, కోడుమూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని “డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.







