గూడూరు మండలం చనుగొండ్ల గ్రామం మజారా గ్రామమైన వైఖానాపురం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఉప్పరి కృష్ణ అనే రైతుకు సంబంధించిన రెండు గడ్డివాములు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి దగ్ధం అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే కోడుమూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పి వేసేందుకు ప్రయత్నించినప్పటికీ నీరు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న రైతులు తమ పొలంలోని బోరు మోటార్ల ద్వారా నీటిని సేకరించి మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు గడ్డివాముల మంటలను ఆర్పి వేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. గడ్డివాములు అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. రైతుకు దాదాపుగా రెండు గడ్డివాములకు కలిపి రెండు లక్షలు వరకు నష్టం వాటిల్లింది.