చంద్రబాబు మొండి వైఖరి వీడాలి
పేదలకు విద్యా, వైద్యాన్ని దూరం చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దు..
వైఎస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆగ్రహం
కోడుమూరు పట్టణంలో కోటి సంతకాల పత్రాల ఊరేగింపు..
కిరణ్ 24×7 న్యూస్:
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న మొండివైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబు వీడాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ సూచించారు. పేదలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని వారు హితవు పలికారు. కోడుమూరు నియోజకవర్గం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
నియోజవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల పత్రాలను ఇవాళ కోడుమూరు నుంచి భారీ ప్రదర్శనగా ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటం దుర్మార్గమన్నారు. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడం సరికాదన్నారు.
కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్‌షీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కోడుమూరు నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని తమ మద్దతు తెలిపారని చెప్పారు. అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టామని, ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ సంతకాలు చేశారని తెలిపారు.
ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా వారు అభివర్ణించారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగిందని పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నామని, ఈ నెల 17న పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ పెద్దలు ఈ కోటి సంతకాలను గవర్నర్‌కు అందిస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులను వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు నియోజకవర్గ అబ్జవర్ హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, జడ్పిటిసి, ఎంపీపీ, మండల కన్వీనర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, వార్డు మెంబెర్స్, జిల్లా నాయకులు, నియోజవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






