తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారాలు..అసత్యాలతో ఫ్లెక్సీలు దారుణం
కోడుమూరు పోలీసులకు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఫిర్యాదు
కిరణ్ 24×7 న్యూస్:
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలు, ఎన్‌డీడీబీ రిపోర్టుపై అసత్య ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుర్మార్గమని కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మండిపడ్డారు. తిరుమల లడ్డూపై ఆధారరహిత ఆరోపణలు అన్నీ అసత్యమని సీబీఐ రిపోర్టు స్పష్టం చేసినప్పటికీ, కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం కోడుమూరు సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఆదిమూలు సతీష్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరామని తెలిపారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంలో పనిచేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై నిందలు మోపే ప్రయత్నం చేశారని, అయితే సీబీఐ, సిట్ విచారణలు, అలాగే ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ఐ, రిపోర్టులు జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నిర్ధారించాయని గుర్తు చేశారు. నిజాలు బయటపడిన తరువాత కూడా అదే అసత్యాలను ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను నిందితులుగా చూపిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా తప్పు అని అన్నారు. ఫ్లెక్సీలు తొలగించాలని కోరితే, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడమేనా? తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా? అని తీవ్రంగా నిలదీశారు. ఆరు గంటలపాటు అంబటి రాంబాబు ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అలాగే జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని దుశ్చర్య అని విమర్శించారు. పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కూటమి పాలనలో రావణకాష్టంలా రగిలిపోతున్న మరో బీహార్‌గా మార్చేస్తున్నారు అని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోడుమూరు నియోజకవర్గం సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ లింగన్న,వార్డు సభ్యులు విష్ణు దాస్, హనుమంతు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






