మురికినీటి మయంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్

** తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపడతాం :
సిపిఐ నాయకులు రాజు హెచ్చరిక…

కిరణ్ 24×7 న్యూస్ :
కోడుమూరు పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ కాలనీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మురికినీటి నిల్వల సమస్యపై సిపిఐ నాయకులు రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్య కారణంగా భారీగా మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోందని ఆయన పేర్కొన్నారు.

కాలనీలో సిసి రోడ్లు, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీడీవో, ఈవోఆర్డి, గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు వినతి పత్రాల ద్వారా సమస్య తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదన్నారు. అధికారులు నిధులు లేవంటూ కాలనీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
“జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్వయంగా కాలనీని సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని,లేదంటే కాలనీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని రాజు స్పష్టం చేశారు.మురికినీటి నిల్వల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని, పాములు, తేళ్లు సంచరించడం ఎక్కువై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదల కాలనీ అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
కాలనీ ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ నాయకులు రాజు కోరారు.