*గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలి*

*సేవలు అందించడంలో ప్రజల నుండి ఫిర్యాదులు రాకూడదు*

*జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

కిరణ్ 24×7 న్యూస్:

*కర్నూలు, జనవరి, 09: గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు,గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, పెన్షన్లు, రెవెన్యూ, హాజరు, సేవల నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు అంశంపై మాట్లాడుతూ సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్ కు వెళ్ళే ముందు సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు ను కచ్చితంగా వేయాలన్నారు. అలా చేయకపోతే, సిబ్బంది హాజరు అయిన రోజులకు మాత్రమే జీతభత్యాలు చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. అలాగే సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలన్నారు. పెన్షన్ల పంపిణీపై మాట్లాడుతూ, లబ్ధిదారులకు పెన్షన్లు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి అందజేయాలని, పెన్షన్ పొందేవారితో గౌరవంగా మెలగాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఉండకూడదన్నారు. ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదలు అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

రెవెన్యూ అంశాలపై మాట్లాడుతూ సర్వేలు నిర్వహించే సమయంలో రైతులకు కచ్చితంగా ముందస్తు నోటీసులు వీఆర్వో/సర్వేయర్ జారీ చేయాలని, ఫీల్డ్ విజిట్లు పక్కాగా నిర్వహించి, సర్వే నివేదికల ప్రతులను సంబంధిత రైతులకు అందజేయాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. హౌసింగ్ అంశాలపై గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల అకౌంట్లలో బిల్లులు ఏ దశలో జమ అవుతున్నాయో స్పష్టంగా తెలియజేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా లబ్ధిదారులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

టెలి కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, ఎంపీడీవోలు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.